NATIONALOTHERSTECHNOLOGY

దేశంలో తొలి హైడ్రోజన్ రైలును హరియాణాలోని జింద్ స్టేషన్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ

హైడ్రోజన్‌ పవర్‌ ట్రైన్‌గా రికార్డు..

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..

హైడ్రోజన్‌ రైలు ఫీచర్లు..

మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయి..

పర్యావరణహితం:-  

అమరావతి: పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే మరొ ముందు అడుగు వేసింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్‌తో నడిచే రైలు అధికారికంగా పట్టాలపై పరుగులు పెట్టింది. హరియాణాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య నడిచే హైడ్రోజన్‌ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.10 కోచ్‌లతో అందుబాటులోకి తెచ్చిన ఈ హైడ్రోజన్‌ రైలు హరియాణాలోని జింద్‌-సోనిపత్‌ స్టేషన్ల మధ్య సేవాలు అందిస్తుంది. ఆదివారం మినహా ఆరు రోజులు నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఆదివారం షెడ్యూల్డ్ నిర్వహణ, సాంకేతిక తనిఖీల కోసం దీనిని దిల్లీలోని షకుర్‌బస్తి వర్క్‌ షాప్‌నకు పంపుతారని తెలిపారు. జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేడా, భంబేవా, ఇషాపుర్ ఖేరి, బుటానా, ఖండ్రాయ్, గోహానా, రభ్రా, లాత్, మోహనా, హరియాణా, బర్వాస్ని స్టేషన్లలో స్టాపులు ఉంటాయన్నారు.

మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయి:- ఈ సందర్బ:లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హైడ్రోజన్ రైలుతో హరియాణా పేరు చిరస్థాయిగా నిలుస్తుందని, భారత రైల్వే రూపురేఖలు మార్చడంతో ఇది కీలకమైన ముందడుగు అని అన్నారు. మిగతా దేశాల హైడ్రోజన్ రైళ్ల కంటే ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు.తమ ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టిందని, భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయన్నారు.2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30 శాతం మాత్రమే ఉందని, తమ ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచడం జరిగిందని, హరియాణాలోని డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా అభివృద్ది సాధిస్తొందని  ప్రధాని మోదీ  తెలిపారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ:-  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్‌ రైలు మన ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలిచింది. జింద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత హైడ్రోజన్ రైలు నమూనాను ప్రదర్శించారు. అనంతరం జింద్‌ నుంచి సోనిపట్‌కు బయలుదేరిన తొలి హైడ్రోజన్‌ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జింద్‌ నుంచి సోనిపట్‌కు 89 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రైలు కేవలం రెండు గంటల్లోనే చేరుకుంటుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి, తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు, జింద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రజలను పలకరిస్తూ ప్రధాని మోదీ అభివాదం చేశారు.

పర్యావరణహితం:-  ప్రస్తుతం దేశంలో విస్తృతంగా నడుస్తున్న విద్యుత్‌ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్‌ను తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్‌ రైలు సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఈ రైలు నడుస్తుంది. అంటే హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చుకుని ఇంజిన్‌ను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటిఆవిరిని ఉద్గారంగా వెలువరిస్తుంది. నీటిఆవిరి బయటకు వెలువడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డీజిల్‌ ఇంజిన్ల వల్ల కార్బన్‌ ఉద్గారాలు వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి ఉంటుంది. హైడ్రోజన్‌ రైలు వల్ల చమురుపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతుంది.

హైడ్రోజన్‌ పవర్‌ ట్రైన్‌గా రికార్డు:- డీజిల్ ఇంజన్లతో పోలిస్తే హైడ్రోజన్‌ రైలు ఇంజిన్‌ తక్కువ శబ్దం చేస్తుంది.3,200 హెచ్‌పీ సామర్థ్యంగల ప్రొపల్షన్‌ వ్యవస్థతో నడిచే ఈ రైలు నిర్వహణలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్‌ పవర్‌ ట్రైన్‌గా రికార్డు సృష్టించింది. ఈ రైలుకు పది బోగీలు ఉండగా ప్రపంచంలోనే అతి పొడవైన ప్యాసింజర్ హైడ్రోజన్ రైలుగాను రికార్డులకు ఎక్కింది. దీనిలో 2,600 మంది ప్రయాణించొచ్చు. ఈ రైల్లో వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అవి హైడ్రోజన్‌ లీకేజీ, వేడి, మంటలు, పొగ వంటి ముప్పు తలెత్తే పరిస్థితులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకన్లలోనే అప్రమత్తం చేస్తాయి. రైల్లో వెంటిలేషన్‌ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడుతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్‌ షట్‌ఆఫ్‌ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్‌ సరఫరాను నిలిపివేస్తుంది. భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్‌ క్యాబిన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. లోకో పైలట్‌ ఎదుట ఉండే స్క్రీన్‌ రైలు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

హైడ్రోజన్‌ రైలు ఫీచర్లు ఇవే:-  1,200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఫ్యూయెల్‌ సెల్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్‌ మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. హైడ్రోజన్‌ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళుతుంది. ఆక్సిజన్‌ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ రైలులోని ట్రాక్షన్‌ మోటార్లకు శక్తిని అందిస్తుంది. అవి చక్రాలను నడుపుతాయి. దీని ప్రొపల్షన్‌ వ్యవస్థ సామర్థ్యం 3,200 హెచ్‌పీ. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తిమంతమైన హైడ్రోజన్‌ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహనచర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కర్బనఉద్గారాలు వెలువడవు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *