భారీ ఉగ్ర కుట్రకు వ్యూహం పన్నిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు
జైషే-మహ్మద్, స్లీపర్ సెల్..
క్రూడ్ టైమ్ బాంబు తయారు..
ఐదుగురు అరెస్టు..
అమరావతి: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ముష్కరులను గుజరాత్ (యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్) ATS అధికారులు అరెస్టు చేశారు. పటన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా ఖడియాల్ గ్రామంలో వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పాలన్‌పురి, షఫియా రాయిస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్దియాగా గుర్తించారు. నిందితులను మెహసానా జిల్లాలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్.ఎం భాటియా ముందు గుజరాత్ ATS అధికారులు హాజరుపర్చారు. ఈ ఐదుగురిని జులై 24 వరకు గుజరాత్ ATS కస్టడీకి ఆర్.ఎం భాటియా అప్పగించారు.
నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు:- గుజరాత్‌లో ఉగ్ర నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ జులై 3వ తేదిన ATS చేతికి అహ్మద్, ఇబ్రహీం, ముదస్సిర్, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్, మహమ్మద్ అమీన్ షేరా, మహమ్మద్ అబ్దుల్, బిలాల్ మహమ్మద్ లు చిక్కారు. ఆ 8 మంది ఉగ్రవాదులను విచారించగా ఈ ఐదుగురి పేర్లు బయటకొచ్చాయి. నిందితుల్లో ఒకడు క్రూడ్ టైమ్ బాంబును తయారు చేసి, దాన్ని పరీక్షించేందుకు విఫలయత్నం చేసినట్లు గుజరాత్ ATS అధికారులు తెలిపారు. తొలుత అరెస్టైన ఎనిమిది మందిలో ఒకరైన అమీన్ అనే వ్యక్తి, నిందితులకు బాంబు తయారీ సామగ్రిని సరఫరా చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీఆర్ దంతానీ వెల్లడించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, తన ఉగ్ర కార్యకలాపాలను మరింతగా వ్యాప్తి చేయడానికి గుజరాత్‌లో ఒక క్రియాశీల నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసేందుకు నిందితులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 17, 18, 38, 39, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 148, 61 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
బాంబు తయారీ సామగ్రిని ఎక్కడ సేకరించారు? :- అరెస్టైన ఐదుగురిలో ఒకరు టైమ్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నించారని, అందుకే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ATS కోరుతోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీఆర్ దంతానీ కోర్టుకు తెలిపారు.బాంబు తయారీ సామగ్రి, ఉర్దూ భాషలో ఉన్న జైషే మహ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అన్నారు. నిందితులు ఒక టైమ్ బాంబును పరీక్షించడానికి ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నం విఫలమైందని వెల్లడించారు. వారు బాంబు తయారీ సామగ్రిని ఎక్కడ సేకరించారు? దానిని ఎక్కడ దాచిపెట్టారు? జైషే మహ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను నిందితులు ఎలా పొందారు? అనే అంశాలపై ATS దర్యాప్తు చేస్తోందన్నారు. టైమ్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాది వద్ద జైషే మహ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీఆర్ దంతానీ కోర్టుకు తెలిపారు.
జైషే-మహ్మద్” స్లీపర్ సెల్:- జైషే మహ్మద్‌కు చెందిన ఎనిమిది మందిని జులై 3న గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్,నవసారిలతో పాటు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్ధరాత్రి ATS అధికారులు దాడులు నిర్వహించారు. వీరిలో గుజరాత్‌కు చెందినవారు ఏడుగురు కాగా మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఒకరు ఉన్నారు. వీరు గుజరాత్‌లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ ను విస్తరించడానికి, కొత్త సభ్యులను చేర్చుకోవడానికి, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ATS అధికారులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారి కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లలో వందల సంఖ్యలో డిజిటల్ ఫైళ్లను గుర్తించారు. అహ్మదాబాద్‌ను కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా తమ నెట్‌వర్క్ ను విస్తరించేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు ATS అధికారులు పేర్కొన్నారు. ఈ మాడ్యూల్ గుజరాత్‌కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. “దారుల్ ఇస్లాం గుజరాత్ జైషే-మహ్మద్” స్లీపర్ సెల్‌పై ATS అధికారులు చేపట్టిన ఈ తాజా చర్యలో భాగంగా మూడవ విడత అరెస్టులు జరిగాయి. దీంతో అరెస్టయిన అనుమానితుల మొత్తం సంఖ్య 18కి చేరింది.

