భారత నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్బోట్లు హెచ్చరిక కాల్పులు
అమరావతి: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపడంతో,ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సదరు సంఘటనపై వివరణ కోరుతూ దిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన మార్గంలో జరిగిన ఆ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
అధికార వర్గాల సమాచారం మేరకు, ఇరాన్‌కు చెందిన గన్బోట్లు హెచ్చరిక కాల్పుల్లో సిబ్బందికి ఎలాంటి గాయాలు జరగలేదని, నౌకలకు కూడా పెద్దగా నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రెండు నౌకలు తమ ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి, ఒమన్‌కు ఈశాన్య దిశగా వెనక్కి మళ్లినట్లు సమాచారం. దాడికి గురైన నౌకల్లో ఒకటి అతి పెద్ద క్రూడ్ ఆయిల్ క్యారియర్ అని తెలుస్తొంది. భారీ పరిమాణంలో ఉండే ట్యాంకర్లు ముడి చమురును సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగిస్తారు. ఇలాంటి నౌకపై కాల్పులు జరగడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్, 24 గంటల్లోనే మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

