మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే- సీఎం చంద్రబాబు
రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని జాతికి ద్రోహం..
అమరావతి: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం, అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి సీఎం ఈ నిరసన ర్యాలీలో ప్లకార్డులు చేతపట్టుకుని నడిచారు. మహిళా బిల్లును అడ్డుకున్న రోజును ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మహిళా ద్రోహులని పేర్కొన్నారు. మహిళా సమాజానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల్ని ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సీఎం అన్నారు. ఎన్డీఏ పక్షాలతో కలిసి నిరసన ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ..” భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నిన్నటి రోజు ఓ బ్లాక్ డే. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని సుదీర్ఘ కల సాకారం అవుతుందని భావించాం. పార్లమెంటు, అసెంబ్లీలోనూ 33 శాతం మంది మహిళల్ని ప్రజాప్రతినిధులుగా చూస్తామని అనుకున్నాం. విపక్షాల వైఖరికి నిడదవోలులో ఎన్డీఏ పక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాం.మహిళలంతా బయటకు వచ్చి వారికి నిరసన తెలియాలని పిలుపు ఇస్తున్నాను.
హోం మంత్రి పార్లమెంటు సాక్షిగా హామీ:- దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని, హోం మంత్రి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు.50 శాతం మేర సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఏపీలో కూడా 50 శాతం మేర సీట్లు పెరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం.దీనిని అడ్డుకోవటం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా.?” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
విద్రోహంపై ఇంటింటికీ ప్రచారం:- “నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్తాం. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమే. దీనిపై పవన్ కల్యాణ్‌నూతో మాట్లాడాను. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలి. మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకుంటాయా? 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం.ఎన్డీఏ పక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

