అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు-టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో, అదనపు వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు,, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబరు 4న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ.13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు.
రద్దు అయిన సేవాలు:-
– వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు.
– బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు.
– అంగప్రదక్షిణ టోకెన్ల రద్దు.
భక్తులకు సౌకర్యలు:-
శ్రీవారి ఆలయం: భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జితసేవలు రద్దు.భక్తుల కోసం అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను సిద్దం చేశాం.
– శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1.32 లక్షల రూ.300/` దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం.
– తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయి.
– తిరుమలలోని పలు కూడళ్లలో భక్తులకు అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు.
– గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్ హౌస్ ఇతర ప్రాంతాల్లో కలిపి 28 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం.
– తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు 24 గంటల పాటు ఉచిత బస్సుల ఏర్పాటు.
– గరుడ వాహనాన్ని సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 11 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతాం.
భద్రత :–దాదాపు 1250 మంది టిటిడి నిఘా,భద్రతా సిబ్బంది.. పోలీసు సిబ్బంది దాదాపు 3900.. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత.. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,775 సిసి కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ.
– సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో భద్రతా సిబ్బందితోపాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం.
– భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబరు : 155257కు ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీవారి సేవా సదన్ వద్ద 4 అదనపు లగేజి సెంటర్లు ఏర్పాటు.
పార్కింగ్: – తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు.
– తిరుమలలో పార్కింగ్ ప్రదేశాలు : బాలాజినగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంత.
– తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ , శ్రీవారి మెట్టు వద్ద 6 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు.
వసతి :– తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగింది. విఐపి ఏరియాలో 1,353 గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని గదుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు బస చేసే అవకాశముంది.
– పిఏసి -1, 2, 3, 4లలో కలిపి 28 హాళ్లలో దాదాపు 6700 లాకర్లు ఉన్నాయి. దాదాపు 20 వేల మంది భక్తులు బస చేయవచ్చు.
– భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వసతి పొందలేని భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా విజ్ఞప్తి.
– బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది.
– అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 7, 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు.
– అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించబడదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మనవి.