AP&TGEDU&JOBSOTHERS

సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని భేటీ-పరీక్షల విధానంలో సమూల సంస్కరణలు

ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ టాస్క్‌ ఫోర్స్ చైర్మన్ సమావేశం..

పేపర్ లీకేజీల నివారణ, పారదర్శక పరీక్షల నిర్వహణ..

సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ బలోపేతం..

అమరావతి:  దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్‌ ఫోర్స్ చైర్మన్ నందన్ నిలేకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన నందన్ నిలేకనికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై చర్చించారు. దేశంలో పరీక్షల విధానాన్ని సమూలంగా సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి పరీక్షల నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తోంది.

సమగ్ర జాతీయ పరీక్షా విధానం:- పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టడం, నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై టాస్క్‌ ఫోర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని రూపొందించడంతోపాటు అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు, న్యాయం కల్పించే సమగ్ర జాతీయ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో అనుసరించిన నూతన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి టాస్క్‌ ఫోర్స్ సభ్యులకు వివరించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కేవలం పరీక్షల నిర్వహణకే పరిమితం కాకూడదని, విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా మొత్తం విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *