రాయలసీమ అభివృద్ధికి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కొత్త దిశానిర్దేశం-ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: రాయలసీమ అభివృద్ధికి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కొత్త దిశానిర్దేశం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.బుధవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం 2వ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భాంని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు సువర్ణగిరిగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ ప్రాంతం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే రోజులు వచ్చాయని అన్నారు. శతాబ్దాల క్రితమే బంగారం, రత్నాల సంపదతో ఈ నేల ప్రసిద్ధి చెందిన విషయాని గుర్తు చేస్తూ,నేడు ఆధునిక సాంకేతికతతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే కేంద్రంగా మారబోతుందని వ్యాఖ్యనించారు.
బంగారు నగల తయారీ పరిశ్రమ:- గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కూడా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు నగల తయారీ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. అదే జరిగితే జొన్నగిరి ఖనిజ సంపదకే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల కేంద్రంగా కూడా ఎదుగుతుందన్నారు. రాయలసీమలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు వేగంగా వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంపై దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల దృష్టిపడుతుందని, రాబోయే రోజుల్లో రాయలసీమను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

