టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
మంత్రి వర్గ సమావేశం..
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించించేందుకు పలు ప్రొత్సహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక ఇంధన రంగాలకు ప్రాధన్యం ఇస్తూ మంత్రివర్గం కీలక తీర్మానాలు చేసింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా 35,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.139 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పర్యవేక్షణ కోసం సీఆర్డీఏలో 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు అంగీకరించారు. అలాగే అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో అక్కడ ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు.
పదవీ విరమణ 62 సం..:- ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో భారీ పర్యాటక ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనమే లక్ష్యంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు జరపడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని క్యాబినెట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్ను:- ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4,000గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు గణనీయమైన ఊరట లభించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు మారిన వాహనాల రిజిస్ట్రేషన్లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఏర్పడనుంది.
OPS-Memo-57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

