DISTRICTS

యోగా ప్రతి మారుమూల పల్లెకు చేరాలి : కలెక్టర్‌ ఆనంద్‌

నెల్లూరు: యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లా నలుమూలల వ్యాప్తి చెందేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరికి యోగా ప్రాధాన్యత తెలిపి వారి దినచర్యలో యోగాను ఒక భాగం చేయడం యోగాంధ్ర ప్రధాన లక్ష్యంగా కలెక్టర్‌ ఆనంద్ చెప్పారు. యోగా మార్గంలో పయనిస్తే అనారోగ్యం బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యానికి చేరువ అవుతారని తెలిపారు. వివిధ రకాల వృత్తులు, వ్యాపారాలు చేసేవారు యోగ సాధన చేస్తే తమ తమ వృత్తి ఉద్యోగాల్లో మరింత నైపుణ్యం సాధించి మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. చిన్న వయసు నుండే యోగ సాధన చేస్తే ఏకగ్రత , జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థిని విద్యార్థులు తమ చదువుల్లో ముందంజ వేస్తారని వివరించారు. అందరికీ యోగాను చేరువ చేయాలనే మంచి లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. జూన్‌ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొంటారని, అదేరోజు జిల్లాలో సుమారు 10లక్షల మంది యోగసనాలు ఆచరించేలా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోని మైపాడు బీచ్, పెంచలకోన, ఉదయగిరి పర్యాటక ప్రాంతాల్లో సామూహిక యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.ఇప్పటికే 300మంది మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ పూర్తిచేశామని, గ్రామ,వార్డుస్థాయిలో సుమారు 7000 మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వీరందరూ గ్రామ,వార్డుస్థాయిలో ప్రజలకు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరులోని స్వర్ణాల చెరువు యోగాభ్యాసకులతో నిండిపోయింది. యోగాంధ్ర 2025 కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో యోగ ఆచరించాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువులోని ఇరుగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మందికి పైగా యోగ సాధకులతో కలసి జడ్పీ చైర్‌ పర్సన్‌,  జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, వివిధ శాఖల అధికారులు వేలాది ప్రజలతో కలిసి సామూహిక యోగా సాధన చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *