డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు వహించండి- కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: కలుషిత తాగునీటితో ప్రబలే డయేరియా పట్ల ప్రజలందరికీ అవగాహన పెంచి నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ హెల్ప్ లైన్ సహాయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూర్యతేజ తెలిపారు.నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులతో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో “డయేరియా నివారణ-తాగునీటి నాణ్యత” అంశంపై సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కలుషిత తాగునీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులైన డయేరియా, దోమల ద్వారా వ్యాపించే మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, ఇతర వ్యాధులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాలు ప్రభలే అవకాశం అధికంగా ఉంటుందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో అదనపు కమీషనర్ నందన్, యస్. ఈ.రామ్ మోహన్,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, అర్బన్ ఫామిలీ వెల్ఫేర్ అధికారి జిజియా బాయి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయం అమెనిటీస్, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.