DISTRICTS

తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్రదర్శన టికెట్లను పునరుద్ధరించాలి-మంత్రి రాజేంద్రన్

నెల్లూరు: తమిళనాడు టూరిజం కార్పొరేషన్‌కు ఎప్పటిలాగే తిరుమల తిరుపతి శీఘ్ర దర్శన టిక్కెట్లను కేటాయించాలని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రాజేంద్రన్‌ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రి ఆనంకు లేఖను అందజేశారు. మంగళవారం ఉదయం చెన్నై నుంచి నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్‌కు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండి ఫరూక్‌ ఘనస్వాగతం పలికారు. వేదపండితుల వేద ఆశీర్వాచనాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 1974వ సంవత్సరం నుంచి తమిళనాడు టూరిజం డెవలప్‌మెంటు కార్పొరేషన్‌కు టిటిడి దర్శన టిక్కెట్లను కేటాయిస్తుందని, దీంతో తమిళనాడులోని భక్తులు చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం టీటీడీ కల్పించిన అవకాశాన్ని భక్తుల సేవ కోసం వినియోగిస్తున్నట్లు  తమిళనాడు టూరిజం మంత్రి రాజేంద్రన్‌ మంత్రి ఆనంకు వివరించారు. అయితే ఇటీవల అన్ని టూరిజం కార్పొరేషన్లకు, శీఘ్ర దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు రద్దు చేసిందని, దీనిని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన మంత్రి ఆనంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఆర్డీవో అనూష తదితరులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *