పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగింపు-కమిషనర్
పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణాలు…
ఖాళీ స్థలాల యజమానులకు…
నెల్లూరు: నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించి, పాదచారుల నడకకు అంతరాయం లేకుండా చూడాలని ఫుట్ పాత్ లను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు.పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా స్థానిక 16వ ప్రాంతాల్లో కమిషనర్ గురువారం పర్యటించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో పాదచారుల మార్గాన్ని ఆక్రమించి వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ఆయా దుకాణాలను తొలగించి పాదచారుల మార్గాన్ని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఖాళీ స్థలాల యజమానులకు:- రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో స్థానిక వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఖాళీ స్థల పన్నులు విధించి వసూలు చేయాలని ఆదేశించారు. వివరాలు తెలియని ఖాళీ స్థల యజమానుల సమాచారాన్ని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించాలని సూచించారు.
నిర్మాణాలను ఆపేయాలి:- పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు అనుమతులు లేని భవన నిర్మాణాలను గుర్తించి, పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన ప్లాను కాపీని నిర్మాణ సమయంలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నిరుపయోగంగా వదిలేసిన వాహనాలు, వైర్లు, తీగలు, ఇతర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా డ్రైన్ కాలువలపై నిర్మించిన ర్యాంపులను అవసరమైన మేరకు తొలగించి ప్రవాహానికి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ప్రకాష్, అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,వార్డ్ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.