రెవిన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీలను త్వరతిగతి పరిష్కరించండి-జె.సీ
నెల్లూరు: రెవిన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం సునిశిత దృష్టి సారించి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ఆడిట్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ తెలిపారు.సోమవారం రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడి కార్డులు మంజూరు, ఉపాధిహామీ పనిదినాల పెంపు, పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు అభివృద్ధి పనుల పూర్తి మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీవోలు, తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని, అక్కడికక్కడే పరిష్కరించే సమస్యను కూడా ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా సమస్య పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలన్నారు. అలాగే రెవెన్యూ సదస్సుల గురించి ముందస్తు సమాచారం గ్రామీణ ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లా కేంద్రం కు వచ్చే అర్జీదారులు రెవెన్యూ సదస్సులపై తమకు అవగాహన లేదని తెలియజేస్తే, సంబంధిత మండల అధికారులపై చర్యలుంటాయన్నారు. అదేవిధంగా పి ఎ సి యస్ లకు సంబంధించిన ఈకేవైసీ సచివాలయ సిబ్బంది ద్వారా త్వరగా పూర్తి చేయాలన్నారు.