వర్చువల్ విధానంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
నెల్లూరు: జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారుల చిరకాల కోరికను నెరవేరుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను వర్చువల్ విధానంలో మహారాష్ట్ర లోని పాల్ఘర్ నుండి శుక్రవారం రు. మంత్రి పొంగూరు నారాయణ, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, కావలి శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తిక్ కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 288.8 కోట్ల వ్యయం తో 76.89 ఎకరాల్లో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను భారత ప్రధాని జాతికి అంకితం చేశారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న తొమ్మిది మండలాల మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 36 మంది మత్స్యకారులు మాత్రమే తమ ఆసక్తిని వ్యక్తం చేశారన్నారు. గతంలో అనుభవం లేకపోవడంతో మత్స్యకారులు భయపడుతున్నారని, వారు అపోహలు వీడి ముందుకు వస్తే అందరికీ అందించడానికి సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా బయటివారు ఫిషింగ్ చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతోనే ఫిషింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కలెక్టర్, ఎంఎల్ఏ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, జువ్వలదిన్నె సర్పంచ్ అంకమ్మ, బోగోలు జడ్పీటిసి సులోచనమ్మ, మత్స్యకారులు పాల్గొన్నారు.