జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టండి-కలెక్టర్ ఆనంద్
వేగంగా అనుమతులు ఇవ్వాలి..
నెల్లూరు: జిల్లాలో వేగంగా పరిశ్రమలు స్థాపించేందుకు అన్నిశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటవుతున్న భారీ పరిశ్రమలకు అన్ని అనుమతులు, భూసేకరణ, నీటివసతి, విద్యుత్ మొదలైన సదుపాయాలు వేగంగా కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు కృషిచేయాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ దిశగా కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో వున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు పనులు త్వరగా మొదలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వస్తున్న దరఖాస్తులను నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో ఆయా పరిశ్రమల నిర్వాహకులకు తెలిపి, రెక్టిషికేషన్ చేయించి మళ్లీ ఆయా పరిశ్రమల నిర్వాహకుల చేత దరఖాస్తులు పెట్టించాలని అధికారులకు సూచించారు. ఇళ్లల్లో యూనిట్లు నిర్వహిస్తున్న లబ్ధిదారులకు 300 యూనిట్ల వరకు ఎపిఎస్‌పిడిసిఎల్ ద్వారా ఉచిత విద్యుత్ అందించే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం, యూనిట్ల విస్తరణ, మరొక యూనిట్ స్థాపనకు పిఎంఈజిపి పథకాన్ని బ్యాంకర్లతో మాట్లాడి అందించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికి పిఎంఈజిపి పథకం వర్తించేలా లబ్ధిదారుల సర్వే చేసి ఎంతమేర రుణం అవసరమో తెలుసుకుని దరఖాస్తు చేయించాలన్నారు. రెడిమెడ్స్, గోల్డ్, ఆఫ్‌సెట్, వెబ్‌ప్రింటింగ్, నోట్‌బుక్ తయారీ క్లస్టర్ లబ్ధిదారులను ఎంపిక చేసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీయల్ బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు.