ఆధునిక భారత రూపశిల్పి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితం స్ఫూర్తి దాయకం- జిల్లా కలెక్టర్ ఆనంద్
ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు..
నెల్లూరు: భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్యభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఐక్యతా దినోత్సవం సందర్భంగా దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతామని విద్యార్థులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశ ఏకీకరణలొసర్ధర్ పటేల్ కీలక పాత్ర పోషించారని, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వందల సంఖ్యలో చిన్నచిన్న రాజ్యాలను ఏకం చేసి, విశాల భారతదేశాన్ని నిర్మించడం పటేల్ చొరవ మరచి పోలేనిదని అన్నారు. భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని కలెక్టర్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం దృఢమైనదని, ఆయన ఉక్కు సంకల్పాన్ని ఈ తరం యువత గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆలాంటి పోరాట యోధుని జీవితంలో ప్రతి ఘట్టాన్ని జీవితానికి అన్వయించుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగ గలరని తెలిపారు. విద్యార్థులకు పటేల్ అంటే తొలి ఉపప్రధానిగా తెలియడం కాదని, దేశాన్ని సంఘటితం చేసిన సమైక్య స్పూర్తి ప్రదాతగా తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులందరూ తాము ఎంచునుకున్న లక్ష్యాల వైపు ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆయన దేశ ఐక్యతకు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కలసి కట్టుగా దేశాభి వృద్ధికి కృషి చేద్దా మన్నారు.
జాయింట్ కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ పటేల్ లేకుంటే ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విశాల భారతాన్ని మనం చూడగలిగి ఉండే వారం కాదని తెలిపారు. జాతి మొత్తాన్ని ఐక్యత వైపు నడిపించిన సమైక్యవాది, పోరాట ధీరుడు పటేల్ అని కొనియాడారు.
నెల్లూరు ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఎంతో కష్టపడి దేశాన్ని సంఘటితం చేసినందుకు ఆయన ఉక్కు మనిషిగా గుర్తింపు పొందారన్నారు .మన ఉద్యోగ నిర్వాహణలో ,పని తీరులో సంఘటితంగా ఉండా లన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, కలెక్టరేట్ ఎ.ఒ.విజయ్ కుమార్ పలువురు అధికారులు,కలెక్టరేట్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.