మరో ఆరు నెలల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేస్తాం-మంత్రులు జనార్ధన్ రెడ్డి, ఆనం
దగదర్తి విమానాశ్రయం కూడా పూర్తిచేసి…
నెల్లూరు: మరో ఆరు నెలల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్యకారులకు అంకితం చేస్తామని రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.. శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి, కావలి ఎంఎల్ఏ కృష్ణారెడ్డి, ఐ అండ్ ఐ సెక్రెటరీ కార్యదర్శి సురేష్ కుమార్ , మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, నాయకులు బీద రవిచంద్ర,అబ్దుల్ అజీజ్ తో కలిసి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2019లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రాజెక్టులో చేపట్టాల్సిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చించామన్నారు. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలపై కూడా కలెక్టర్ వివరించారని, వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి మత్స్యకారుల చిరకాల కోరిక నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యంగా మంత్రి చెప్పారు.
మంత్రి ఆనం:- గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో శంకుస్థాపన చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్టులను పూర్తిచేసి నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ది కృషి చేస్తామన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కొన్ని వేల మందికి జీవనాధారమని,దీన్ని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ జిల్లాకు 3 జాతీయ రహదారులు అనుసంధానమై ఉన్నాయని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే నెల్లూరుజిల్లాకు అనేక పెట్టుబడులు వస్తాయన్నారు. దీనివల్ల రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈ విషయాలన్నింటిపై ముఖ్యమంత్రితో చర్చించి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని మంత్రి ఆనం అన్నారు.