ప్రతి గ్రామం గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ కు జిల్లాలో నాంది పలకాలి-మంత్రి ఆనం
జెడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం..
నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో జిల్లాలో గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ కు నాంది పలకాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి కోరారు.. శనివారం జెడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆనం మాట్లాడుతూ విద్యుత్ఉత్పత్తిలో కాలాగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎటువంటి పర్యావరణ హాని కలగని సౌరవిద్యుత్ ను ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి గ్రామం ఈ సౌర విద్యుత్ పధకాన్ని అందిపుచ్చుకుని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. అలాగే మండల సర్వ సభ్య సమావేశాలకు వివిధ శాఖల మండల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే శాఖ వారు నిర్వహించే గ్రామసభలకు రెవిన్యూ అధికారులు కూడా హాజరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే భూసేకరణ విషయంలో ఇప్పటికే నిర్ణయించిన ధరను మార్చే అధికారం జిల్లా స్థాయిలో లేదని రైతులు గుర్తించాలన్నారు. అలాగే సభ్యులు లేవనెత్తిన ఇరిగేషన్ సమస్యలను పరిషరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.