నాలుగు నెలల్లో రంగనాథస్వామి ఆలయ ఘాట్ నిర్మాణం పూర్తి-మంత్రి నారాయణ
ఆలయాల పవిత్రత కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యం..
నెల్లూరు: పురాతన ఆలయమైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ ఘాట్ నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.ఆదివారం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి పెన్నానది ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2014`19లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆలయ పూజారులు, భక్తుల విన్నపం మేరకు రంగనాయకస్వామి ఆలయంలోని పెన్నఘాట్ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా విస్తరించాలని కోరారన్నారు. భక్తుల కోరిక మేరకు పనులు మొదలుపెట్టామని, అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ పనులు పూర్తిచేయలేదన్నారు. గత ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరించి రివర్స్ టెండరింగ్ పేరుతో ఆలయాల ప్రతిష్టతను దెబ్బతీసిందన్నారు. మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో పాత టెండర్‌ను రద్దు చేసి 15రోజుల్లో కొత్తగా టెండరు పిలిచి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఆలయ అర్చకులు, అధికారులు, భక్తుల సూచనల మేరకు సుమారు నాలుగు నెలల్లోనే సుందరమైన ఘాట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నామని చెప్పారు.అనంతరం విఆర్‌సి సెంటర్ చాకలివీధిలోని మహలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మంత్రి నారాయణ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.