నెల్లూరు జిల్లా 1200మంది కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు-మంత్రి సత్యకుమార్
నెల్లూరు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.శుక్రవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు బయ్యా రవి, బయ్యా వాసు, మరికొందరు దాతల సహకారంతో ఏర్పాటుచేసిన బయ్యా సరోజనమ్మ లయన్స్ పినాకిని డయాలసిస్ సెంటర్‌ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం రెండునెలల్లోనే పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు మొదలుపెట్టిందన్నారు. నెల్లూరు జిల్లా 1200మంది కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని, రాష్ట్రంలో సుమారు 11వేల కొత్త కేసులు నమోదైయ్యాయన్న మంత్రి, డయాలసిస్ సెంటర్లను విరివిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆరు డయాలసిస్ యూనిట్లను లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రోజురోజుకు కిడ్నీవ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుందని, దేశంలో 3.40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుంటే, ప్రతిఏటా 2.30 లక్షల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు మంత్రి చెప్పారు.
దాతలు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వీటి నిర్వహణను ప్రభుత్వం భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో వింజమూరు, పొదలకూరులో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు శాసనసభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీకి పేరు మార్చి ఎన్‌టిఆర్ వైద్యసేవగా అమలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు వైద్యసేవలు అందిస్తుందని మంత్రి గుర్తుచేశారు. ఆయుష్మాన్‌భారత్, ఎన్టీఆర్ వైద్యసేవ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం జీరో వెకెన్సీ చూపించిందని, వాస్తవంగా ఆసుపత్రల్లో చాలా పోస్టులు ఖాళీగా వున్నాయని, సుమారు 3వేల పైగా వెకెన్సీలు వున్నాయని, త్వరలో వైద్యారోగ్యశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపడ్తామని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రోగుల సహాయం కోసం సెంట్రలైజ్డ్ హెల్ప్‌డెస్క్, డాష్‌బోర్డును ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.