డ్రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం- సీఎం చంద్రబాబు
అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం..
అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీ టీవీ కెమేరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి… వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గరున్న సమాచారం కాకుండా, అదనపు సమాచారం కోసం మాత్రమే ఇకపై సర్వేలు జరపాలి తప్ప, పదేపదే ఒకేరకమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మరోవైపు రాష్ట్రంలో వాట్సప్ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాట్సప్ సేవల సంఖ్యను 953కి పెంచినట్టు తెలిపారు. అయితే వీటన్నింటినీ సులభంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.

