కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
త్రికోటేశ్వరస్వామిని దర్శనం..
అమరావతి: కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం కోటప్పకొండ-కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం కోట్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు.రూ.3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు.
శివరాత్రి ఉత్సవాలకు:- కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
కోటప్పకొండ గిరిప్రదక్షణకు:- గిరిపద్రక్షణ మార్గం లే అవుట్ పరిశీలన త్రికోటేశ్వర స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కొండ చుట్టూ గిరిప్రదక్షణ మార్గం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన లే అవుట్ ని పరిశీలించారు. పల్నాడు రేంజ్ డీఎఫ్ఓ శ్రీమతి జి. కృష్ణప్రియ అటవీ మార్గంలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని చూపించారు. అటవీశాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియను వివరించారు. కోటప్పకొండ గిరిప్రదక్షణకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతున్న నేపధ్యంలో త్వరితగతిన గిరిప్రదక్షణ మార్గం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన నరసరావుపేట ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
