తిరుపతి వేదికగా అట్టహాసంగా అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం
ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నమోదు..
ప్రతిభను వెలికితీసే వేదిక..తిరుపతి ఎమ్మేల్యే ఆరణి శ్రీనివాసులు
రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..మంత్రి రాంప్రసాద్ రెడ్డి
క్రీడలతో క్రమశిక్షణ, క్రీడలతో విద్య–ఉద్యోగ అవకాశాలు..రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత
క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి మూలం..జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్
నిజమైన క్రీడా ప్రతిభను వెలికితీయడమే మా లక్ష్యం..శాప్ ఛైర్మన్ రవి నాయుడు
తిరుపతి: తిరుపతి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయని ఈ పోటీలు ఆగస్టు 27 వరకు కొనసాగానున్నాయని క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రీడల అభివృద్ధికి చేపట్టిన ప్రతిష్టాత్మక మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నూతన రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా స్థానం సంపాదించింది.
ఈ సందర్భంగా క్రీడా, రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అమరావతి ఛాంపియన్‌షిప్‌ను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో సుమారు 2,07,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, జిల్లా స్థాయిలో సుమారు 84,000 మంది పోటీపడగా, ప్రతిభ కనబరిచిన 9,911 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. 12 క్రీడా విభాగాల్లో అండర్–17, అండర్–23 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీయడమే లక్ష్యమన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు సుమారు రూ.200–250 కోట్లు:- ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రూ.92 లక్షల ప్రైజ్ మనీతో పాటు గుర్తింపు, ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని క్రీడా మైదానాల అభివృద్ధికి 2025లో రూ.75కోట్లు కేటాయించారని, ఈ ఏడాది కూడా సుమారు రూ.200–250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, తిరుపతి వేదికగా వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారుల సమక్షంలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలైన క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర స్థాయికి తీసుకురావడంలో SAAP చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తోందన్నారు. SAAP అధికారులు, డీఎస్డీఓలు, లైన్ డిపార్ట్మెంట్లు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, అధికారులు చేసిన కృషిని అభినందించారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ను తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
SAAP ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, గతంలో తిరుపతి అంటే శ్రీవారి దర్శనం గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు తిరుపతి అంటే స్పోర్ట్స్ తిరుపతి అంటే స్పోర్ట్స్ హబ్ అనే స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు జరుగుతున్నాయని అన్నారు.

