రాజధానిలో రివర్ ఫ్రెండ్ టూరిజం-మంత్రి నారాయణ
అమరావతి: రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతిలో అభివృద్ధి చేయనున్న పలు టూరిజం ప్రాజెక్టుల ప్రణాళికలు, అమలు పురోగతి, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమ్యూజ్మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్ నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాజధానిలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికే టూరిజం ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.టూరిజం ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భూములు కేటాయించుకున్న సంస్థలు ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

