డ్రగ్స్ సేవిస్తూ తెలంగాణ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎం.పీని..కాకాణి
టీడీపీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి..
నెల్లూరు: డ్రగ్స్ సేవిస్తూ తెలంగాణ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌తో లోక్‌సభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయించాలని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహేష్‌యాదవ్ మీద ఏ చర్య తీసుకోకుండా ఉంటే, యువత డ్రగ్స్ తీసుకోవాలని స్వయంగా సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చినట్లే అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మహేష్ యాదవ్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని, సామాన్యులకు విధించే శిక్షలకన్నా కఠినమైన శిక్షలను ఆయనకు అమలు చేయాలని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు.
డ్రగ్స్ పార్టీని అరేంజ్ చేసిందే మహేష్ యాదవ్:- టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనడం కన్నా, చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో అచ్చం తెలుగు డ్రగ్స్ పార్టీ అనేలా మారిపోయింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా డ్రగ్స్ టెస్టులో ఆయనకి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలంగాణ ఈగల్ టీం ఎస్పీ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రాజస్ధాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యే నితీశ్శర్మతో కలిసి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఈ డ్రగ్స్ పార్టీని అరేంజ్ చేసినట్టు పోలీసులే చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ మీద ఈగల్ టీమ్ పోలీసులు రైడ్‌కి వెళ్లినప్పుడు, ఎంపీ వారిపైకి కాల్పులకు ప్రయత్నించడాన్నది మరో పెద్ద అభియోగం. పవిత్రమైన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి డ్రగ్స్ సేవిస్తూ దొరకడం మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలా? ఇలాంటి వ్యక్తికి ఎంపీగా కొనసాగే హక్కు లేదు. తక్షణమే ఆయనతో ఎంపీ పదవికి రాజీనామా చేయించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి.
టీటీడీ చైర్మన్‌గా కూడా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్:- టీడీపీలో సీనియర్ నాయకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకే ఈ పుట్టా మహేష్ యాదవ్. అంతే కాకుండా ఆయన గతంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పని చేశాడు. చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి, పరపతితో తప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి అనేది మా వద్ద ఉన్న సమాచారం. అదే జరిగితే యువతకి తప్పుడు సందేశం ఇచ్చినట్టవుతుంది. పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఆయన చేసిన తప్పుకి కఠినంగా శిక్షించాలి. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ని ఉపేక్షించాల్సిన పని లేదు. డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో మహిళలపై జరుగుతున్న నేరాలు ఎక్కువైపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈ కేసుల్లో దొరికిన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో డ్రగ్స్‌ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన చంద్రబాబు రెండేళ్లవుతున్నా అరికట్టకపోగా తన పార్టీ ఎంపీలే నేరుగా డ్రగ్స్ సేవించే దుస్థితికి తీసుకొచ్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు.

