నగర ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయట రండి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరకుండా అవసరమైన అన్ని చర్యలను నిర్విఘ్నంగా చేపడుతున్నామని, కమిషనర్ సూర్యతేజ పేర్కొన్నారు.సహాయక చర్యలను కమిషనర్ బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జెసిబి వాహనాల సహాయంతో నగర వ్యాప్తంగా జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత, ప్రధాన కాలువల ద్వారా వర్షపు నీటి పారుదలకు చేపట్టిన పూడికతీత పనులను కొనసాగిస్తూనే ఉన్నామని చెప్పారు. నగరవ్యాప్తంగా ఉన్న పెద్ద హోర్డింగులను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో గుర్తించి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాటిని తొలగించామని, ఏ ప్రాంతంలో కూడా హోర్డింగుల వలన ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. నగర పాలక సంస్థ సూచించిన నిబంధనలను ఉల్లంఘించి మురుగునీటి కాలువలపై నిర్మించిన ర్యాంపులు, మెట్లు, ఇతర నిర్మాణాలను తొలగించామని కమిషనర్ తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నగర వ్యాప్తంగా విద్యుత్ తీగలకు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను గుర్తించి, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు వారిని తరలిస్తున్నామని, బాధిత ప్రజలకు కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు వర్షాల నేపధ్యంలో స్థానికంగా ఏమైనా సమస్యలు ఏర్పడితే 0861 2356777, 0861 2316777 నెంబర్లకు సమాచారం అందించి నగర పాలక సంస్థ నుంచి తగిన సహాయం పొందాలని కమిషనర్ సూచించారు. ప్రజలంతా వర్షాలకు ఇండ్లలోనే ఉండి రక్షణ పొందాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయట సంచరించాలని కమిషనర్ సూచించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ కి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే తగిన సహాయ చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.