AP&TGDEVOTIONALOTHERS

సెప్టెంబర్ నెల ఆర్జిత,ప్రత్యేక ప్రవేశ,వసతి గదుల కోటాల షెడ్యూల్‌ విడుదల చేసిన టీటీడీ

తిరుమల: సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

టీటీడీ వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి:- శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనదలచిన భక్తులు జూన్ 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు జూన్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే టికెట్లు మంజూరు అవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచనున్నారు.

అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తుండగా, తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్లు, మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *