DISTRICTS

మున్సిపల్ వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించింది-మంత్రి నారాయణ

153 లక్షల టన్నుల చెత్తను వదిలింది…

నెల్లూరు: దొంతాలి డంపింగ్ యార్డును శనివారం మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని, ప్రజలపై చెత్త పన్ను వేసి 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంలో వదిలి వెళ్ళిందని ఆయన విమర్శించారు. మున్సిపల్ వ్యవస్థను కూడా గత పాలకులు సర్వనాశనం చేశారని చెప్పారు. వైసీపీ చేసిన అవకతవకలనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి 2025 అక్టోబర్-2 నాటికి రాష్ట్రంలో చెత్తనంతా తొలగించాలని ఆదేశాలిచ్చినట్టు మంత్రి నారాయణ గుర్తు చేశారు. ఆయన నిర్దేశానుసారం 85 లక్షల చెత్తను తొలగించామని, గ్రౌండ్ లెవల్ కంటే కింద ఉన్న చెత్తను ఇప్పుడు తొలగిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 115 లక్షల టన్నుల చెత్తను తొలగించామని మిగిలిన చెత్తను జూన్ నాటికి తొలగిస్తామని వివరించారు. దొంతాలిలో 50 ఏళ్లుగా డంపింగ్ యార్డు ఉందని, ఇక్కడ 6.73 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, వీలైనంత త్వరగా చెత్తను తొలగిస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో జిందాల్ కంపెనీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని, నెల్లూరుకు 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్త అంతా ఈ ప్లాంటుకు తరలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోజుకి 7 వేల టన్నుల చెత్త వస్తుందని, అందులో 6500 టన్నులు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు చేరి విద్యుత్ గా మారుతుందని చెప్పారు. చైనాలో 1100 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ లు ఉన్నాయని, జపాన్ లో 1000 ఉన్నాయని, అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతోనే చెత్త రహితం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా డంపింగ్ యార్డులే లేకుండా చేయాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆలోచన అని, చెత్త రహిత రాష్ట్రంగా ఏపీని రోల్ మోడల్ గా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కార్పొరేషన్ కమీషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత అశోక్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అనూరాధ, ఇంజినీరింగ్ అధికారులు, ఎమ్మార్వో రవికుమార్, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *