రూరల్ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి పార్ధసారధి
నెల్లూరు: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ప్రజల ముందుకు ధైర్యంగా వెళుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 17వ డివిజన్ వడ్డిపాలెంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రూ. 85 లక్షలతో సిమెంట్ రోడ్డు, బీటీ రోడ్డు, పైపులైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వ హయాంలో 268 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తిచేసిన ఏకైక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఆ సమస్య పరిష్కారానికి శ్రీధర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పార్థసారథి హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

