భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగాలు చరిత్రలో అజరామరంగా నిలిచి ఉంటాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, కమిషనర్ సూర్య తేజ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో దేశంలోనే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుని పోరాటస్ఫూర్తితోనే మనదేశంలో భాష ఆధారంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. స్వాతంత్ర్య భారతావని ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కూడా అన్ని రాష్ట్రాలు వారి వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఎటువంటి వివాదాలు లేకుండా ఐక్యతగా ఉండడానికి ప్రధాన కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే అని గుర్తు చేశారు. అమరజీవిని స్మరించుకోవడం, నివాళులర్పించడం మనందరి బాధ్యతగా కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, పలువురు ఆర్యవైశ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.