ప్రజాస్వామ్యం బలపడాలంటే శాసనసభల్లో చర్చలు ఆర్దవంతంగా జరగాలి-స్పీకర్ అయ్యన్న
అమరావతి: దేశంలో శాసనసభల ప్రతిష్ట, గౌరవం, స్వాతంత్ర్యం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దేశ రాజధాని డిల్లీలో రెండు రోజులు జరిగిన ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన సోమవారం (రెండవ రోజు) పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కేంద్రం ఆమోదించిన చట్టాలు రాష్ట్రాలకూ అన్వయించబడేలా చూడాలని, శాసనసభల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు ఆగాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాసనసభలే హృదయం, అవి బలహీనపడితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో శాసనసభలు సమర్థవంతంగా నడవాలని, చట్టసభల ఉత్పాదకత పెంపు అత్యవసరమని ఆయన అన్నారు.ఇప్పటికే ఆమోదం పొందిన 187 తీర్మానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభలు సంవత్సరానికి కనీసం 50 రోజులపాటు సమావేశమవ్వాలని,అయితే వాస్తవంలో చాలా రాష్ట్రాల్లో 20 రోజులకు మించి సమావేశాలు జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే శాసనసభల్లో చర్చలు లోతైనవిగా, సార్ధకంగా సాగాలని స్పష్టంచేశారు.
ఒకే పార్టీకి మెజారిటీ వచ్చినా ప్రతిపక్ష అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య పటిష్టతకు మౌలికం అని అన్నారు. సభలు ప్రజల సమస్యలను ప్రతిబింబించే వేదికలుగా నిలబడాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం సభ్యుల బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్రాల స్పీకర్లు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.

