నెల్లూరుకు స్వచ్ఛమైన గాలి కోసం రు.13.50 కోట్ల నిధులు-కలెక్టర్ హిమాన్షు
నెల్లూరు: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా నెల్లూరు నగరానికి 2025-26 సంవత్సరానికి రు. 13.50 కోట్ల నిధులు మంజురైనట్లు జిల్లా శుక్ల తెలిపారు. బుధవారం కలెక్టర్ చాంబర్ లో NCAP కింద మంజూరైన నిధుల వినియోగానికి సంబంధించి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ్ టు ఎండ్ పేవింగ్, గ్రీనరీ డెవలప్‌మెంట్ మరియు మెకానికల్ రోడ్ స్వీపింగ్ మొదలైన వాటితో సహా దుమ్ము నియంత్రణ కోసం రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. మియావాకీ ప్లాంటేషన్‌తో నగరంలో పచ్చదనం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్‌లోని 13 నగరాలను పర్టిక్యులేట్ మ్యాటర్ (PM10)కి సంబంధించి నాన్-అటైన్‌మెంట్ సిటీలుగా గుర్తించిందని వాటిలో నెల్లూరు నగరం కూడా ఉన్నట్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి, నెల్లూరుకు స్వచ్ఛమైన గాలి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సంబంధిత రాష్ట్ర అధికారులతో సంప్రదించి రూపొందించారని, దీనిని సి పి సి బి ఆమోదించిందని తెలిపారు. నిర్దేశించిన నిబంధనలకు వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం సిటీ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిటిసి చందర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మారుతి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.