తొలిసారిగా తెలుగులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 2.0 ఉత్తర్వులు
11 జీవోలు ఇంగ్లీష్ తో పాటు తెలుగులోను..
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్ ను ఆదివారం ఉండవల్లి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి, సంబంధిత అధికారులతో రాష్ట్ర పన్నుల విధానం పై సమీక్షించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వాణిజ్య పన్నుల శాఖ మొదటిసారిగా జీవోలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇప్పుడు పన్నులకు సంబంధించిన జీవోలను తమ మాతృభాష తెలుగులో సులభంగా చదువుకోగలుగుతారు. ఏదైనా విషయాన్ని మాతృభాషలో చదివినప్పుడు అది సులభంగా హృదయానికి చేరుతుందని చెప్పడం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది వ్యాపారులు, అకౌంటెంట్లు, అధికారులు, ఉద్యోగులు, నిపుణులు అభినందించారని రాష్ట్ర పన్నులు-వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్ బాబు తెలిపారు. జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను సంస్కరణ కాదు.. ఇది ప్రజలే ముందు అనే విధానం. ఇది ఖర్చులను తగ్గిస్తుంది, అనుసరించే విధానాన్ని సులభతరం చేయడంతోపాటు ప్రతి ఇంటిని, రైతులను, విద్యార్థు లను శక్తివంతం చేయడంతోపాటు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ట్రాక్టర్ల నుండి పాఠ్యపుస్తకాలు, మందుల వరకు ఆదా చేసిన ప్రతి రూపాయి సుస్తిరాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు ఇది ఒక మార్పు.