జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు-10.50 శాతం వృద్ధి నమోదు- సీఎం చంద్రబాబు
గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు..
అమరావతి : సుస్థిర ఆర్ధిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జీఎస్డీపీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-26 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1 శాతం వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నాం, ఏమేరకు ఫలితాలు సాధించాం అనేది విశ్లేషించుకోవాలన్నారు.
అన్ని రంగాల వృద్ధికి ప్రత్యేక అధ్యయనం : – సుదీర్ఘ సముద్రతీరం, పుష్కలంగా జలవనరులు, మెరుగైన మౌలిక వసతులు ఇలా ఎన్నో అంశాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. కొన్ని రంగాలు ఎందుకు పురోగతి సాధించడం లేదనే దానిపై కారణాలు తెలుసుకునేందుకు నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం జరపాలన్నారు. పర్యాటక రంగంలో ప్రస్తుతం సాధించిన 17.08 శాతం పురోగతి సరిపోదని… ఈ రంగంలో 25 శాతం వృద్ధికి అవకాశం ఉందన్నారు. వృద్ధిలోనూ అంతర్జాతీయ లక్ష్యాలను అందుకోవాలన్నారు. రైల్వేస్, ట్రాన్స్‌పోర్ట్, హోటళ్లు, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. శాఖలు, రంగాలు, నియోజకవర్గాల వారీగా జీఎస్డీపీ వివరాలను మరింత లోతుగా నమోదు చేయాలని అన్నారు.