సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారేందుకు ఉద్యోగులకు అవకాశం
అర్హులైన ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ..
డిసెంబర్ 31లోగా NIDHI పోర్టల్లో ఆప్షన్ సమర్పించాలి..
పదవీ విరమణ పొందిన, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకూ అవకాశం..
అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 53 (13.07.2026) అమలుకు సంబంధించి తాజాగా జీఓ ఎంఎస్ నంబర్ 158 (09.11.2026) ద్వారా సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 11 వేల ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం సుమారు 11 వేల కుటుంబాల్లో నిజమైన దీపావళి వెలుగులు నింపిందని సంఘం పేర్కొంది. ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను, సమస్య తీవ్రతను గుర్తించి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్లకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
ఎవరెవరికి అవకాశం?– 01.09.2004కు ముందు నియామక ప్రకటన వెలువడి, ఆ తేదీ లేదా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులై ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు నిబంధనలకు అనుగుణంగా అర్హులైన పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ ఒక్కసారి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
డిసెంబర్ 31లోగా ఆప్షన్ సమర్పణ:- అర్హులైన ఉద్యోగులు నిర్దేశించిన విధానంలో NIDHI పోర్టల్ ద్వారా 31.12.2026లోపు తమ ఆప్షన్ను సమర్పించుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి. రామకృష్ణ కోరారు.

