గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు-అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
తీర ప్రాంతాల్లో అప్రమత్తత..
సహాయక చర్యలకు 21 NDRF,SDRF..
ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాకు భారీ వర్ష సూచన..
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అత్యున్నత స్థాయి సన్నద్ధతతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు.
అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం:- ప్రస్తుత అంచనాల ప్రకారం అక్టోబర్ 26 ఉదయానికి వాయుగుండం తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, అక్టోబర్ 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని సమీక్షలో వెల్లడించారు.
బాపట్ల–విశాఖపట్నం మధ్య:- అక్టోబర్ 28న ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు బాపట్ల–విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు సమీక్షలో వివరించారు.
గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు:- తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో ఈదురుగాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు. అక్టోబర్ 27 ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాకు భారీ వర్ష సూచన:- అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
పునరావాస కేంద్రాలు, ఆహారం, వైద్యంపై ప్రత్యేక దృష్టి:- తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, అక్కడ ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రిజర్వాయర్లలో నీటిని నిల్వ:- భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు:- సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అన్ని పడవలు సురక్షితంగా తీరానికి చేరుకునేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
అన్ని శాఖలు సమన్వయంతో:- తుఫాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) అధికారులు, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, హోం, ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు హాజరయ్యారు.

