AP&TG

అక్టోబర్ 27 నుంచి 29 మధ్య ఉత్తర ఆంధ్రను తాకే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

8 ఏళ్ల తర్వాత భారీ తుపాను ముప్పు..

కేటగిరీ 3 తీవ్రతను మించే అవకాశం..

కోస్తా తీరం వెంబడి గంటకు 70-90కిమీ వేగంతో..

మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకొవాలి..

ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి..

అధికారిక ప్రకటన వెలువడే వరకు..

అమరావతి: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సుస్పష్టమైన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తీవ్రవాయుగుండంగా అలాగే ఎల్లుండి ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉదయానికి మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

కోస్తా తీరం వెంబడి గంటకు 70-90కిమీ వేగంతో:- దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు, కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆదివారం (25-10-2026):–  కృష్ణా , బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షపాతం:- శనివారం సాయంత్రం 6 గంటల నాటికి వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురంలో 71.5 మిమీ, అనంతపురం జిల్లా మాలపురంలో 74.5మిమీ, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లిలో 50.5మిమీ, కడప జిల్లా జంగంరెడ్డిపల్లిలో 45.1మిమీ, అనంతపురం జిల్లా మురడిలో 44.9మిమీ,అనంతపురం జిల్లా విడపనకల్లులో 43.4మిమీ, కడప జిల్లా జమ్మలమడుగు గూడెంచెరువులో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకొవాలి:- తుపానుకు ముందు ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసి ఉంచుకుంటూ విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని గమనిస్తుండాలని సూచించారు. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవడంతో పాటు, కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు ఉండేలా కిట్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇంటి పైకప్పు, తలుపులు- కిటికీలు సురక్షితంగా ఉన్నయో లేదో తనిఖీ చేయడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి:- తుపాను సమయంలో ఇంట్లో ఉన్నవారు ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి, తలుపులు, కిటికీలు గట్టిగా మూసి ఉంచాలన్నారు. ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు. కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఒకవేళ ఆకస్మికంగా భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే, బలమైన టేబుల్/బెంచ్ కింద తలదాచుకుని రక్షణ పొందాలన్నారు.వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయాలకు తరలివెళ్లాలని కోరారు. ఒకవేళ తుపాను సమయంలో బయట ఉంటే, దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి  వెళ్లకూడదని, చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని ఎండీ తెలిపారు.

అధికారిక ప్రకటన వెలువడే వరకు:- తుపాను తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు అధికారిక ప్రకటన వెలువడే వరకు షెల్టర్లను వదిలి ఇళ్లకు వెళ్లవద్దు. తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర అప్రమత్తతతో ఉండలన్నారు. నీటిలో తడిసిన లేదా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించిన తర్వాతే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. తమ పడవలు మరియు తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడులతో గట్టిగా కట్టి సురక్షితంగా ఉంచాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం 112, 1070 మరియు 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *