కార్మికులు మస్టర్ పాయింట్లలో హాజరు వేయించుకోవాలి-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగరంపై ఆవగాహన పెంచుకునే దిశగా కమిషనర్ సూర్య తేజ తనిఖీలు నిర్వహిస్తున్నారు.పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక తడికల బజార్, తోటబడి, పత్రి వారి వీధి, స్టోన్ హౌస్ పేట, కాంతమ్మ ఆశ్రమం, ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లోని మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలోని సిబ్బంది క్రమం తప్పకుండా మస్టర్ పాయింట్లలో హాజరు వేయించుకోవాలని, కార్మికులంతా నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం తోటబడి, పప్పుల వీధి, వాటర్ ట్యాంక్ లలోని తాగునీటి పంపింగ్ స్టేషనులను కమిషనర్ పరిశీలించారు. పంపింగ్ స్టేషన్లో తాగునీటి నాణ్యత పరీక్షలను ప్రత్యక్షంగా కమిషనర్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం చిల్డ్రన్స్ పార్క్ ను కమిషనర్ పరిశీలించారు. పార్కులో నిరుపయోగంగా, శిథిలావస్థలో ఉన్న ఫౌంటైన్లను పరిశీలించి, గతంలో వినియోగిస్తున్న మ్యూజికల్ నైట్ ఫౌంటెన్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ క్రీడా వస్తువులు, వ్యాయామ పరికరాలను పరిశీలించి వాటి పునరుద్ధరణకు అవసరమైన మరమ్మత్తు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. పార్కు నేమ్ బోర్డ్ ను విద్యుత్ వెలుగులతో ఉండేలా నూతనంగా రూపొందించాలని సూచించారు. పార్కులోని పిచ్చి మొక్కలు, వ్యర్ధాలను పూర్తిగా తొలగించి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. పార్కులోని స్విమ్మింగ్ పూల్ నిర్వహణ తీరు, చిన్నపిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో తీసుకుంటున్న రక్షణ చర్యలు, పూల్ లో వినియోగిస్తున్న నీటి ప్రమాణాలను అధికారులను అడిగి కమిషనర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ ఈ.ఈ సంజయ్, సిబ్బంది, శానిటేషన్ విభాగం సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.