అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాం- మేయర్ స్రవంతి
కౌన్సిల్ సమావేశం..
నెల్లూరు: జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 68 మెయిన్ అజెండా, 15 సప్లిమెంటరీ అజెండా, 8 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 91 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, అందులో 2 వాయిదా పడగా, 89 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్, సయ్యద్ తహసీన్, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్య తేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.