2025-26 అగ్నివీర్ సిబ్బంది నియామకాల ధరఖాస్తుల స్వీకరణ-కర్నల్ పునీత్ కుమార్
అమరావతి: ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించిందని కర్నల్ పునీత్ కుమార్,డైరెక్టర్,ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.. నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ 2025 కాగా ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహించబడుతోందన్నారు. అదనంగా 1.6 కిలోమీటర్ల పరుగు సమయాన్ని 06 నిమిషాలు 15 సెకన్లకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎన్‌సీసీ ‘ఎ’, ‘బి’ & ‘సి’ సర్టిఫికెట్ కలిగిన వారికి-ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అలాగే అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటిఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇవ్వబడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు,నెల్లూరు, అనంతపురము,కడప, ప్రకాశం,చిత్తూరు,బాపట్ల,పల్నాడు,నంద్యాల, తిరుపతి, అన్నమయ్య,సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్-అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, అగ్నివీర్‌గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దని కోరారు.