DISTRICTS

భారతీయులందరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన గేయం వందేమాతరం-హిమాన్షు శుక్ల

కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ ను ప్రారంభించిన కలెక్టర్‌

నెల్లూరు: స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన మహోన్నత దేశభక్తి గేయం వందేమాతరం అని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల వందేమాతరం గేయం ఔన్నత్యాన్ని కీర్తించారు. వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల, అధికారులు, సిబ్బంది వందేమాతరం గేయాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వందేమాతరం దేశభక్తి గేయాన్ని ఆలపించి ఆ గేయం గొప్పతనాన్ని, కీర్తిని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. వందేమాతరం గేయం భారతదేశ చరిత్రలో ఒక ధృడమైన మైలురాయిగా కలెక్టర్‌ చెప్పారు. యావత్‌ భారత జాతిని సంఘటితం చేసి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో వందేమాతరం గీతం కీలక భూమిక పోషించిందన్నారు. సమాజంలో నేటికీ ఈ వందేమాతరం స్ఫూర్తి అవసరమన్న కలెక్టర్‌, మతాలు వేరైనా, భాషలు వేరైనా మొదట మనమంతా భారతీయులమనే విషయాన్ని గ్రహించి, అందరూ ఐకమత్యంగా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో విజయకుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి తుమ్మా విజయకుమార్‌, మత్స్యశాఖ జేడి శాంతి, ఐఅండ్‌పిఆర్‌ డిడి వేణుగోపాల్‌రెడ్డి, డిఇ శివశంకర్‌, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌కు నిత్యం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, ప్రజల సౌకర్యార్థం లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల చెప్పారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన లిఫ్ట్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో  మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు లిఫ్ట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.కలెక్టర్‌ ఛాంబర్ మొదటి అంతస్తులో ఉండడం వల్ల చాలామంది తనను కలిసేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. వారందరి కోసమే  మంచి ఆలోచనతో ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *