స్వయం సహాయక సంఘాలను MSMEలుగా రిజిస్ట్రేషన్-అదనపు కమిషనర్
నెల్లూరు: పట్టణాలలోని పేద మహిళల చేత ఏర్పాటు చేసిన స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలను సుస్థిర వ్యవస్థలుగా తీర్చిదిద్ది, తద్వారా సుస్థిరమైన జీవనపాదుల కల్పన ద్వారా మహిళల కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచే ప్రణాళికలను అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ వై.ఓ. నందన్ తెలియజేశారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్ డైరెక్టర్ ఎం. తేజ్ భరత్ ఆధ్వర్యంలో పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, మెప్మా పి.డి.రాధమ్మ పాల్గొని వివిధ మెప్మా కార్యక్రమాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి ఇతర సేవల ద్వారా ఉపాధిని పొందుతున్న స్వయం సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులను సంఘటిత రంగంలోకి మార్చేందుకు తొలిసారిగా MSMEలుగా వారిని రిజిస్ట్రేషన్ చేయనున్నామని తెలిపారు. MSME రిజిస్ట్రేషన్ ద్వారా వృత్తికి, వ్యాపార అభివృద్ధికి హామీలేని సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు, కేంద్ర ప్రాజెక్టు రుణాలు పొందేందుకు అవకాశం ఉందని వివరించారు. చేస్తున్న వృత్తి వ్యాపారాలకు పూర్తి చట్టబద్ధత కల్పించనున్నామన్నారు. నైపుణ్య అభివృద్ధి పొందేందుకు, విస్తృతమైన మార్కెట్ ను అందుకునేందుకు, బ్రాండింగ్ సహకారం పొందడానికి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తుందని వివరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మార్చి 8వ తేదీ నాడు ఒకేరోజు లక్ష ఉత్పత్తులకు పైగా అమ్మకం జరపడం ద్వారా కోటి రూపాయలకు పైగా ఆదాయం సంఘ సభ్యులకు వచ్చేలా చేయుటకు ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నామని తెలిపారు. మార్చి 8వ తేదీ నాడు ముఖ్యమంత్రి, పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో లక్ష ఉత్పత్తుల అమ్మకాలు విజయవంతంగా జరపనున్నమని తెలిపారు.