ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు-కలెక్టర్
నెల్లూరు: దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాస్థాయి దేవాదాయశాఖ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఆలయాల పరిధిలో అన్యాక్రాంతమైన ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మకూరులోని కొలగాని రామయ్య చౌల్ట్రీ భూముల ఆక్రమణ, దుకాణాల తొలగింపుపై దృష్టి సారించాలన్నారు. తొలుత దుకాణాలను తొలగించాలని సూచించారు. పేదలు ఆక్రమించి వుంటే వారికి ప్రత్యామ్నయంగా ప్రభుత్వ స్థలాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆలయాల పరిధిలో ఆస్తుల పరిరక్షణకు కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఎఎస్పీ సౌజన్య, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ జె.శ్రీనివాసరావు, డిపివో సుస్మిత, ఆత్మకూరు ఆర్డీవో మధులత, కావలి ఆర్డీవో శీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.