పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే గాంధీజీకు అసలైన నివాళి-కలెక్టర్
నెల్లూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే మహాత్మాగాంధీజీకు అసలైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గాంధీ జయంతి స్వచ్ఛభారత్ దివస్ సందర్బంగా స్వచ్ఛతా హి సేవ ముగింపు కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలోని పదివేల ఆవాసాల్లో గుర్తించిన చెత్త, మురికి కూపాలను నాలుగువేల మంది కార్మికులు సేవలను ఉపయోగించుకుంటూ లక్ష మంది ప్రజల భాగస్వామ్యంతో శుభ్రపరిచామన్నారు. కేవలం పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ బాధ్యతని భావించకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ k.కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన అందరికీ ధన్యవాదాలని, ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, పరిశుభ్రతా ప్రాధాన్యం అందరూ గుర్తించాలన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మాట్లాడుతూ స్వాతంత్రానంతర భారతదేశంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని గాంధీజీ కలలుగన్నారని, అటువంటి జాతిపిత స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలన్నారు.
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో సేవలు అందించిన అధికారులను సత్కరించారు..పారిశుద్ధ్య కార్మికులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు శ్రమదాన్ అవార్డులు ప్రధానం చేశారు.