రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా విక్రయించుకునేలా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.ఈక్రాప్‌ను ఈనెల 25లోగా పూర్తి చేయాలన్నారు. సిసిఆర్‌సి కార్డులు పొందిన కౌలురైతులకు అవసరమైన బ్యాంకు రుణాలను మంజూరు చేయించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా జిల్లా సహకారశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ కోపరేటివ్ సొసైటీల్లో పురుగుమందు రహిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో దగదర్తిలోని పిఎసిఎస్‌లో పురుగుమందు రహిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిసివో గుర్రప్ప కలెక్టర్‌కు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్:- జిల్లాలో ఐదువేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యంగా కాగా ఇప్పటికే మూడువేల ఎకరాల్లో డ్రిప్ పరికరాలు అమర్చినట్లు ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన 2వేల ఎకరాల డ్రిప్ పరికరాల ఏర్పాటు లక్ష్యాన్ని త్వరగా అధిగమించాలని కలెక్టర్ సూచించారు.