అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం-మంత్రి పార్ధసారధి
నెల్లూరు: గృహ నిర్మాణల్లో గత ప్రభుత్వం పాలనలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. శుక్రవారం ఎమ్మేల్యే సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పేదల గృహ నిర్మాణాలను పరిశీలించారు. జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతి గురించి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, ఆదివాసి గిరిజనులకు లక్ష రూపాయల వంతున మంజూరు చేసామన్నారు. ప్రస్తుతమున్న అధిక ధరలను దృష్టిలో ఉంచుకొని పేద ఎస్సీ,ఎస్ టి, బీసీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ గృహ నిర్మాణ యూనిట్ కాస్ట్ ను 1.8 లక్షల నుండి 2.5 లక్షల వరకు పెంచామన్నారు.
అదేవిధంగా గత ప్రభుత్వంలో అమాయక గిరిజనులను మోసం చేసి ఇళ్లు నిర్మించకుండానే ఆయా మొత్తాలను దిగమింగిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడేది లేదన్నారు. అదేవిధంగా శాఖపరంగా సరైన పర్యవేక్షణ లేనందున అవకతవకులు జరిగాయన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై శాఖపర చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేయని, నిజాయితీగల ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఆనం,ఎమ్మేల్యే,అధికారులు తదితరలు పాల్గొన్నారు.