AP&TGHEALTHOTHERS

6 నెలల్లో మరో 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల కొత్త భవన నిర్మాణల పూర్తి- మంత్రి సత్యకుమార్

ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల నూతన భవనాలు సిద్ధం..

24 జిల్లాల్లో 267 కొత్త  కేంద్రాలు ఏకకాలంలో ప్రారంభం..

అమరావతి: గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోందని  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లోని జనార్దనపురంలో నూతన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని  మంత్రి, మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగానే  రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మరో 266 భవనాలను వర్చువల్‌గా ఏకకాలంలో ప్రారంభించారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు.

రాబోయే 6 నెలల్లో మిగిలిన 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల నూతన భవనాలను సిద్ధం చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామానికే వైద్యం:- ప్రతి 5 వేల జనాభాకు ఒకటి చొప్పున ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 71 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బీపీ, మధుమేహం, మాతా శిశు ఆరోగ్యం, కంటి, నోటి ఆరోగ్యం, వృద్ధుల ఆరోగ్యం, అంటువ్యాధులను ముందుగానే గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

‘సంజీవని’తో ఆరోగ్య సమాచారం ఒకేచోట:- ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, భవిష్యత్తులో అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ‘సంజీవని’ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను కేటాయించి, వైద్య పరీక్షలు, మందులు, వైద్యుల సలహాలు, ఆసుపత్రుల్లో పొందిన చికిత్స వివరాలను భద్రపరిచే విధానం తీసుకొస్తున్నామని చెప్పారు.జనవరి 1 నుంచి ఈ సేవలను ప్రారంభించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

930 మొబైల్ ఆరోగ్య కేంద్రాలు:- మారుమూల గ్రామాలకు వైద్య సేవలను తీసుకెళ్లేందుకు 930 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక్కో వాహనంలో 41 రకాల పరీక్షలు నిర్వహించే సదుపాయంతోపాటు, సుమారు రూ.10 లక్షల విలువైన ఆటో అనలైజర్ పరికరం ఉంటుందని చెప్పారు. ఈ వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామాలను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. సాధారణంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యే కొన్ని పరీక్షలను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *