తిరుమలలో భద్రతపై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
తిరుమల: దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై డీజీపీ హరిష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో శ్యామలరావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నతస్థాయి భద్రత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చర్చించారు.
అనంతరం టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడుతూ, భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయ పడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ మహేష్ చంద్ర లద్దా, అనంతపురం రేంజ్ డీఐజీ డా.శేముషి, ఐఎస్ డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, అలాగే వివిధ భద్రతా బలగాల అధికారులు పాల్గొన్నారు.