శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడిని-టీటీడీ చైర్మన్
భక్తులు సేవకు సమిష్టి కృషి చేయాలి..
తిరుమల: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అని టీటీడీ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్.నాయుడు తెలియజేశారు. ప్రమాణస్వీకారం అనంతరం బుధవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెలలో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.