సైబారాబాద్ కంటే మిన్నగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలి-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: సైబారాబాద్ కంటే మిన్నగా 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని,, నేటి యువత భవిష్యత్ డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందన్నారు..ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైనా చర్చించారు.. కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీ.ఎం అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా రాష్ట్రంలో ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర.. ఇలా ఐదు ప్రాంతాల్లో జోనల్‌హబ్‌లకు కేంద్రంగా అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పనిచేయాలని చెప్పారు.